ఇతనికంటే మరిదైవము కానము యెక్కడా వెదకిన నితడే
అతిశయమగు మహిమలతో వెలసెను అన్నిటికాధారముతానె ||
మదిజలధులనొకదైవము వెదకిన మత్స్యావతారంబితడు
అదివో పాతాళమందు వెదకితే ఆదికూర్మమీ విష్ణుడు
పొదిగొని యడవుల వెదకి చూచితే భూవరాహమనికంటిమి
చెదరక కొండల గుహల వెదకితే శ్రీనరసింహంబున్నాడు
తెలిసి భూనభోంతరమున వెదకిన త్రివిక్రమాకృతి నిలిచినది
పలువీరులలో వెదకిచూచితే పరశురాముడొకడైనాడూ
తలపున శివుడునుపార్వతి వెదకిన తారకబ్రహ్మమురాఘవుడు
కెలకుల నావులమందల వెదకిన కృష్ణుడు రాముడునైనారు ||
పొంచి అసురకాంతలలో వెదకిన బుధ్ధావతారంబైనాడు
మించిన కాలము కడపట వెదకిన మీదటికల్క్యావతారము
అంచెల జీవులలోపల వెదకిన అంతర్యామై మెరసెను
యెంచుక ఇహమున పరమున వెదకిన యీతడే శ్రీవేంకటవిభుడు ||
itanikaMTE maridaivamu kAnamu yekkaDA vedakina nitaDE
atiSayamagu mahimalatO velasenu anniTikAdhAramutAne ||
madijaladhulanokadaivamu vedakina matsyAvatAraMbitaDu
adivO pAtALAmamdu vedakitE AdikUrmamI viShNuDu
podigoni yaDavula vedaki chUchitE bhUvarAhamanikaMTimi
chedaraka koMDala guhala vedakitE SrInarasiMhaMbunnADu
telisi bhUnabhOMtaramuna vedakina trivikramAkRti nilichinadi
paluvIrulalO vedakichUchitE paraSurAmuDokaDainADU
talapuna SivuDunupArwati vedakina tArakabrahmamurAghavuDu
kelakula nAvulamaMdala vedakina kRShNuDu rAmuDunainAru ||
poMchi asurakAMtalalO vedakina budhdhAvatAraMbainADu
miMchina kAlamu kaDapaTa vedakina mIdaTikalkyAvatAramu
aMchela jIvulalOpala vedakina aMtaryAmai merasenu
yeMchuka ihamuna paramuna vedakina yItaDE SrIvEMkaTavibhuDu ||