పసిడియక్షంతలివె పట్టరో వేగమె రారో
దెసల పేరంటాండ్లు దేవుని పెండ్లికిని
శ్రీవేంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి
దైవికపు పెండ్లిముహూర్తము నేడు
కావించి భేరులు మ్రోసె గరుడధ్వజంబెక్కె
దేవతలు రారో దేవుని పెండ్లికిని
కందర్ప జనకునకి కమలాదేవికి
పెండ్లిపందిలిలోపల తలంబాలు నేడు
గంధమూ విడెమిచ్చేరు కలువడాలు గట్టిరి
అందుక మునులు రారో హరి పెండ్లికిని
అదె శ్రీ వేంకటపతికి అలమేలు మంగకును
మొదలి తిరుణాళ్ళకు మ్రొక్కేము నేడు
యెదుట నేగేరు వీరెయిచ్చేరు వరములివె
కదలిరారో పరుష ఘనుల పెండ్లికిని
|