ప|| ఎంత జాణరో యీకలికి | కాంతుడ నీ భోగములకే తగునూ ||
చ|| చెలి నీ కౌగిట చెమటలజేసెను | చలువగ నిప్పుడు జలకేళి |
అలరుచు గుచముల నదుముచు జేసెను | పలుమరు ముదముల బర్వతకేళి ||
చ|| పైపై బెనగుచు బాహులతలనే | వైపుగ జేసెను వనకేళి |
చూపుల నీపయి సొలయుచు జేసెను | పూప వసంతము పూవులకేళి ||
చ|| అరుదుగ నట్టివి యధరామృతముల | సరిజేసెను భోజనకేళి |
కరగుచు శ్రీవేంకటేశ సేసేను | పరగిన రతులనె పరిణయ కేళి ||
pa|| eMta jANarO yIkaliki | kAMtuDa nI BOgamulakE tagunU ||
ca|| celi nI kaugiTa cemaTalajEsenu | caluvaga nippuDu jalakELi |
alarucu gucamula nadumucu jEsenu | palumaru mudamula barvatakELi ||
ca|| paipai benagucu bAhulatalanE | vaipuga jEsenu vanakELi |
cUpula nIpayi solayucu jEsenu | pUpa vasaMtamu pUvulakELi ||
ca|| aruduga naTTivi yadharAmRutamula | sarijEsenu BOjanakELi |
karagucu SrIvEMkaTESa sEsEnu | paragina ratulane pariNaya kELi ||