ప|| దొరతో సంగాతము దొరికిన పాటే చాలు | వొరసి మీరగ బోతే నొక్కరీతి నుండునా ||
చ|| యేకతాన లోన నుండి యేలనన్ను బిలిచేవు | వాకిటికి రావయ్యా వలసితేను |
చేకొని యొకతె యుంటె సిగ్గువడి వెళ్ళి వచ్చి | కూకులు వత్తులుగాను కూళదాననా ||
చ|| మరగించి మరగున మాట లేలాడించేవు | తెఅదియ్యవయ్య అంత తీట గలిగితె |
వరుసకు వచ్చి నాపె వాదు నాతో బెట్టుకొంటె | విరసమై యూరకుండ వెఱ్ఱిదాననా ||
చ|| పట్టె మంచముపై నుండి పైగాలు చాచనేల | యిట్టె వుర మెక్కవయ్య యింత గలిగె |
జట్టిగా శ్రీ వేంకటేశ సరినొకతె గూచుంటె | వట్టి యితవు సేసుకో వాసిలేని దాననా ||
pa|| doratO saMgAtamu dorikina pATE cAlu | vorasi mIraga bOtE nokkarIti nuMDunA ||
ca|| yEkatAna lOna nuMDi yElanannu bilicEvu | vAkiTiki rAvayyA valasitEnu |
cEkoni yokate yuMTe sigguvaDi veLLi vacci | kUkulu vattulugAnu kULadAnanA ||
ca|| maragiMci maraguna mATa lElADiMcEvu | teadiyyavayya aMta tITa galigite |
varusaku vacci nApe vAdu nAtO beTTukoMTe | virasamai yUrakuMDa verxrxidAnanA ||
ca|| paTTe maMcamupai nuMDi paigAlu cAcanEla | yiTTe vura mekkavayya yiMta galige |
jaTTigA SrI vEMkaTESa sarinokate gUcuMTe | vaTTi yitavu sEsukO vAsilEni dAnanA ||