Ghantasala's Bhagawad Gita Part 1 Telugu

Ghantasala's Bhagawad Gita - ఘంటశాల భగవద్గీతా Telugu Part 1

 001 ॥ పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయమ్ ।

వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతమ్ ॥
అద్వ్యైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీమ్ ।
అంబా! త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్ ॥

భగవద్గీత. మహాభారతము యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునునకు ఒనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరుగరాదని సర్వ విధముల భగవానుడు ప్రయత్నించెను. కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయెను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథియై నిలిచెను.

యుద్ధ రంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి, హృదయము ద్రవించి,

002 ॥ న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ ।
కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ॥ (01:32)

స్వజనమును చంపుటకు ఇష్టపడక "నాకు విజయమూ వలదు, రాజ్య సుఖమూ వలదు" అని ధనుర్బాణములను క్రింద వైచి. దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ,

003 ॥ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ।
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ॥ (02:11)

దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని, నిత్యములూ, శాశ్వతములూ అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు.

004 ॥ దేహినోస్మిన్యథా దేహే కౌమారం యౌవనం జరా ।
తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి ॥ (02:13)

జీవునకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము యెట్లో, మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుకు ఈ విషయమున ధీరులు మోహము నొందరు.

005 ॥ వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోపరాణి ।
తథా శరీరాణి విహాయ జీర్ణాని
అన్యాని సంయాతి నవాని దేహీ ॥ (02:22)

మనుష్యుడు, ఎట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించునో, అట్లే, ఆత్మ - జీర్ణమైన శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించుచున్నది.

006 ॥ నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః ।
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః ॥ (02:23)

ఆత్మ నాశనములేనిది. ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింప జాలదు. నీరు తడుపజాలదు. వాయువు ఆర్పివేయనూ సమర్థము కాదు. ఆత్మ నాశనములేనిది.

007 ॥ జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ ।
తస్మాదపరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి ॥ (02:27)

పుట్టిన వానికి మరణము తప్పదు. మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు.

008 ॥ హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్ ।
తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః ॥ (02:37)

యుద్ధమున మరణించినచో వీర స్వర్గమును పొందెదవు. జయించినచో రాజ్యమును భోగింతువు. కావున అర్జునా, యుద్ధమును చేయ కృతనిశ్చ్యుడవై లెమ్ము.

009 ॥ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ।
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి ॥ (02:47)

కర్మలను ఆచరించుటయందే నీకు అధికారము కలదు కాని, వాని ఫలితము పైన లేదు. నీవు కర్మ ఫలమునకు కారణము కారాదు. అట్లని, కర్మలను చేయుట మానరాదు.

010 ॥ దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః ।
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ॥ (02:56)

దుఃఖములు కలిగినపుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినపుడు స్పృహ కోల్పోని వాడును, రాగమూ, భయమూ, క్రోధమూ పోయినవాడును స్థిత ప్రజ్ఞుడని చెప్పబడును.

011 ॥ ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే ।
సంగాత్-సంజాయతే కామః కామాత్-క్రోధోభిజాయతే ॥ (02:62)

క్రోధాద్-భవతి సమ్మోహః సమ్మోహాత్-స్మృతివిభ్రమః ।
స్మృతిభ్రంశాద్-బుద్ధినాశో బుద్ధినాశాత్-ప్రణశ్యతి ॥ (02:63)

విషయ వాంఛలను గూర్చి సదా మననము చేయువానికి, వానియందనురాగ మధికమై, అది కామముగా మారి, చివరకు క్రోధమగును. క్రోధము వలన అవివేకము కలుగును. దీనివలన జ్ఞాపకశక్తి నశించి, దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును.

012 ॥ ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి ।
స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి ॥ (02:72)

ఆత్మజ్ఞాన పూర్వక కర్మానుష్ఠానము, బ్రహ్మ ప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున బడక, సుఖైక స్వరూపమైన ఆత్మ ప్రాప్తిని చెందగలడు.

013 ॥ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ ।
జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్ ॥ (03:03)

అర్జునా! ఈ లోకములో ఆత్మానాత్మ వివేకముగల సన్యాసులకు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్ధిగల యోగీశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగు చున్నదని సృష్టి ఆదియందు నాచే చెప్పబడియున్నది.

014 ॥ అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః ।
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః ॥ (03:14)

అన్నమువలన జంతుజాలము పుట్టును. వర్షము వలన అన్నము సమకూడును. యజ్ఞము వలన వర్షము కలుగును. ఆ యజ్ఞము కర్మ వలననే సంభవము.

015 ॥ ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః ।
అఘాయురింద్రియారామో మోఘం పార్థ స జీవతి ॥ (03:16)

పార్థా! నాచే నడుపబడు ఈ లోకము అను చక్రమునుబట్టి, ఎవడు అనుసరింపడో వాడు ఇంద్రియలోలుడై పాప జీవనుడగుచున్నాడు. అట్టివాడు వ్యర్థుడు. జ్ఞాని కానివాడు సదా కర్మలనాచరించుచునే యుండవలెను.

016 ॥ యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః ।
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ॥ (03:21)

ఉత్తములు అయినవారు దేని నాచరింతురో, దానినే ఇతరులును ఆచరింతురు. ఉత్తములు దేనిని ప్రమాణముగా అంగీకరింతురో, లోకమంతయూ దానినే అనుసరింతును.

017 ॥ మయి సర్వాణి కర్మాణి సంన్యస్యాధ్యాత్మచేతసా ।
నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః ॥ (03:30)

అర్జునా! నీవొనర్చు సమస్త కర్మలనూ నాయందు సమర్పించి, జ్ఞానముచే నిష్కాముడవై, అహంకారము లేనివాడవై, సంతాపమును వదలి యుద్ధమును చేయుము.

018 ॥ శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ ।
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ॥ (03:35)

చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మముకన్న, గుణము లేనిదైననూ స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించిననూ మేలే. పరధర్మము భయంకరమైనది. ఆచరణకు అనుచితమైనది.

019 ॥ ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ ।
యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్ ॥ (03:38)

పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లే కామముచేత జ్ఞానము కప్పబడియున్నది.

020 ॥ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ।
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ॥ (04:07)

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ।
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ॥ (04:08)

ఏ కాలమున ధరమమునకు హాని కలుగునో, అధరమము వృద్ధి నొందునో, ఆయా సమయములయందు శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మసంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారమును దాల్చుచున్నాను.

021 ॥ వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః ।
బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః ॥ (04:10)

అనురాగమూ, భయమూ, క్రోధమూ వదిలి నాయందు మనస్సు లగ్నము చేసి ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగముచేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి.

022 ॥ యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్ ।
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ॥ (04:11)

ఎవరెవరు యేయే విధముగా నన్ను తెలియగోరుచున్నారో, వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను. కాని, ఏ ఒక్కనియందును అనురాగము కాని, ద్వేషము కాని లేదు.

023 ॥ యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః ।
జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః ॥ (04:19)

ఎవరి కర్మాచరణములు కామ సంకల్పములు కావో, ఎవని కర్మలు జ్ఞానమను నిప్పుచే కాల్పబడినవో, అట్టివానిని పండితుడని విద్వాంసులు పల్కుదురు.

024 ॥ బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ ।
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా ॥ (04:24)

యజ్ఞపాత్రము బ్రహ్మము. హోమద్రవ్యము బ్రహ్మము. అగ్ని బ్రహ్మము. హోమము చేయువాడు బ్రహ్మము. బ్రహ్మ కర్మ సమాధిచేత పొందనగు ఫలము కూడా బ్రహ్మమనియే తలంచవలయును.

025 ॥ శ్రద్ధావాన్ల్లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః ।
జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్ఛతి ॥ (04:39)

శ్రద్ధ, ఇంద్రియనిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును.

ఇది భగవద్గీత యందు బ్రహ్మవిద్యయను యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునకుప దేశించిన విషాద, సాంఖ్య, కర్మ, జ్ఞాన యోగములు సమాప్తము.