Ghantasala's Bhagawad Gita Part 4 Telugu
Ghantasala's Bhagawad Gita - ఘంటశాల భగవద్గీతా Telugu Part 4
076 ॥ యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః ।
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత ॥ (13:34)
పార్థా! సూర్యుడొక్కడే యెల్ల జగత్తులనూ ఏ విధముగా ప్రకాశింపజేయుచున్నాడో ఆ విధముగనే క్షేత్రజ్ఞుడు యెల్ల దేహములనూ ప్రకాశింపజేయుచున్నాడు.
ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతాశాస్త్రమందు శ్రీకృష్ణుడు అర్జునునకుప దేశించిన విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తి యోగము, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములు సమాప్తము.
077 ॥ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్ ।
యజ్జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః ॥ (14:01)
జ్ఞానార్జనమున మహనీయులైన ఋషీశ్వరులు మోక్ష్మును పొందిరి. అట్టి మహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశించుచున్నాను.
078 ॥ సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః ।
తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రదః పితా ॥ (14:04)
అర్జునా! ప్రపంచమున జన్మించు ఎల్ల చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వన్టిది. నేను తండ్రి వన్టివాడను.
079 ॥ తత్ర సత్త్వం నిర్మలత్వాత్ప్రకాశకమనామయమ్ ।
సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ ॥ (14:06)
అర్జునా! త్రిగుణములలో సత్త్వగుణము నిర్మలమగుటన్జేసి సుఖ జ్ఞానాభి లాషలచేత ఆత్మను దేహమునందు బంధించుచున్నది.
080 ॥ రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవమ్ ।
తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినమ్ ॥ (14:07)
ఓ కౌంతేయా! రజోగుణము కోరికలయందు అభిమానమూ, అనురాగమూ పుట్టించి ఆత్మను బంధించుచున్నది.
081 ॥ తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ ।
ప్రమాదాలస్యనిద్రాభిస్తన్నిబధ్నాతి భారత ॥ (14:08)
అర్జునా! అజ్ఞానమువలన పుట్టునది తమోగుణము. అది సర్వ ప్రాణులనూ మోహింపజేయునది. ఆ గుణము మనుజుని ఆలస్యముతోనూ, అజాగ్రత్తతోనూ, నిద్ర తోనూ బద్ధుని చేయును.
082 ॥ మానాపమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయోః ।
సర్వారంభపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే ॥ (14:25)
మానావ మానములయందు, శత్రుమిత్రులయందు సమమైన మనస్సు గలవానిని త్రిగుణాతీతుడందురు.
083 ॥ ఊర్ధ్వమూలమధఃశాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ ।
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ॥ (15:01)
బ్రహ్మమే మూలముగా, నికృష్ణమైన అహంకారము కొమ్మలుగాగల అశ్వత్థ వృక్షము అనాది అయినది. అట్టి సంసార వృక్ష్మునకు వేదములు ఆకులువన్టివి. అట్టి దాని నెరింగినవాడే వేదార్థ సార మెరింగినవాడు.
084 ॥ న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః ।
యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ ॥ (15:06)
పునరావృత్తి రహితమైన మోక్షపథము, సూర్య చంద్రాగ్నుల ప్రకాశమున కతీతమై, నా ఉత్తమ పథమై యున్నది.
085 ॥ అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ।
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ॥ (15:14)
దేహులందు జఠరాగ్ని స్వరూపుడనై వారు భుజించు భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య పదార్థముల జీర్ణము చేయుచున్నాను.
086 ॥ తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా ।
భవంతి సంపదం దైవీమభిజాతస్య భారత ॥ (16:03)
దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ ।
అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీమ్ ॥ (16:04)
పార్థా! సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరుల వంచింపకుండుట, కావరము లేకయుండుట, మొదలగు గుణములు దైవాంశ సంభూతులకుండును. అట్లే, దంబము, గర్వము, అభిమానము, క్రోధము, కఠినపు మాటలాడుట, అవివేకము మొదలగు గుణములు రాక్షసాంశ సంభూతులకుండును.
087 ॥ త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః ।
కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్ ॥ (16:21)
కామ, క్రోధ, లోభములు ఆత్మను నాశనము చేయును. అవి నరక ప్రాప్తికి హేతువులు కావున వానిని వదిలి వేయ వలయును.
088 ॥ యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః ।
న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్ ॥ (16:23)
శాస్త్ర విషయముల ననుసరింపక ఇచ్ఛా మార్గమున ప్రవర్తించువాడు సుఖ సిద్ధులను పొందజాలడు. పరమపదము నందజాలడు.
089 ॥ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా ।
సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు ॥ (17:02)
జీవులకు గల శ్రద్ధ పూర్వ జన్మ వాసనా బలము వలన లభ్యము. అది రాజసము, సాత్త్వికము, తామసములని మూడు విధములగా ఉన్నది.
090 ॥ యజంతే సాత్త్వికా దేవాన్యక్షరక్షాంసి రాజసాః ।
ప్రేతాన్భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః ॥ (17:04)
సత్త్వగుణులు దేవతలను, రజోగుణులు యక్ష రాక్షసులను, తమోగుణులు భూత ప్రేత గణంబులను శ్రద్ధా భక్తులతో పూజించుదురు.
091 ॥ అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ ।
స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే ॥ (17:15)
ఇతరుల మనస్సుల నొప్పింపనిదియూ, ప్రియమూ, హితములతో కూడిన సత్య భాషణమూ, వేదాధ్యన మొనర్చుట వాచక తపస్సని చెప్పబడును.
092 ॥ కామ్యానాం కర్మణాం న్యాసం సంన్యాసం కవయో విదుః ।
సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః ॥ (18:02)
జ్యోతిష్ఠోమాది కర్మల నాచరింపకుండుట సన్యాసమనియూ, కర్మఫలము
యీశ్వరార్పణ మొనర్చుట త్యాగమనియూ పెద్దలు చెప్పుదురు.
093 ॥ అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్ ।
భవత్యత్యాగినాం ప్రేత్య న తు సంన్యాసినాం క్వచిత్ ॥ (18:12)
కర్మఫలములు ప్రియములూ, అప్రియములూ, ప్రియాతిప్రియములూ అని మూడు విధములు. కర్మఫలమునలు కోరినవారు జన్మాంతరమందు ఆ ఫలములను పొందుచున్నారు. కోరనివారు ఆ ఫలములను జన్మాంతరమున పొందజాల కున్నారు.
094 ॥ ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే ।
బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్త్వికీ ॥ (18:30)
అర్జునా! కర్మ మోక్ష మార్గముల, కర్తవ్య భయాభయముల, బంధ మోక్షముల ఏ జ్ఞానమెరుగుచున్నదో అది సత్త్వగుణ సముద్భవమని ఎరుగుము.
095 ॥ ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి ।
భ్రామయంసర్వభూతాని యంత్రారూఢాని మాయయా ॥ (18:61)
ఈశ్వరుడు యెల్ల భూతములకు నియామకుడై, ప్రాణుల హృదయమందున్నవాడై, జంత్రగాడు బొమ్మలనాడించు రీతిగా ప్రాణుల భ్రమింపజేయుచున్నాడు.
096 ॥ సర్వధర్మాంపరిత్యజ్య మామేకం శరణం వ్రజ ।
అహం త్వాం సర్వపాపేభ్యో మోక్ష్యయిష్యామి మా శుచః ॥ (18:66)
సమస్త కర్మలను నాకర్పించి, నన్నే శరణు బొందిన, ఎల్ల పాపములనుండి నిన్ను విముక్తుని గావింతును. నీవు చింతింపకుము.
097 ॥ య ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి ।
భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయః ॥ (18:68)
ఎవడు పరమోత్కృష్టమైన, పరమ రహస్యమైన యీ గీతాశాస్త్రమును నా భక్తుల కుపదేశము చేయుచున్నాడో, వాడు మోక్షమున కర్హుడు.
098 ॥ కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా ।
కచ్చిదజ్ఞానసంమోహః ప్రనష్టస్తే ధనంజయ ॥ (18:72)
ధనన్జయా! పరమ గోప్యమైన యీ గీతా శాస్త్రమును చక్కగా విన్టివా? నీ యజ్ఞాన జనితమైన అవివేకము నశించినదా?
కృష్ణా!
099 ॥ నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత ।
స్థితోస్మి గతసందేహః కరిష్యే వచనం తవ ॥ (18:73)
అచ్యుతా! నా అవివేకము నీ దయ వలన తొలగెను. నాకు సుజ్ఞానము లభించినది. నాకు సందేహములన్నియూ తొలగినవి. నీ ఆజ్ఞను శిరసావహించెదను.
100 ॥ యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః ।
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ ॥ (18:78)
యోగీశ్వరుడగు శ్రీకృష్ణుడు, ధనుర్ధారియగు అర్జునుడు యెచటనుందురో అచట సంపద, విజయము, ఐశ్వర్యము, స్థిరమగు నీతియుండును.
గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ ।
విష్ణొః పదమవాప్నోతి భయ శోకాది వర్జితః ॥
గీతాశాస్త్రమును ఎవరు పఠింతురో వారు భయ శోకాది వర్జితులై విష్ణు సాయుజ్యమును పొందుదురు.
ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతాశాస్త్రమందు శ్రీకృష్ణుడు అర్జునునకుపదేశించిన గుణత్రయ విభాగ, పురుషోత్తమ ప్రాప్తి, దేవాసుర సంపద్విభాగ, శ్రద్ధాత్రయ విభాగ, మోక్షసన్యాస యోగములు సర్వమూ సమాప్తము.
ఓం సర్వేజనాః సుఖినో భవంతు
సమస్త సన్మగళాని భవంతు
అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ
ఓం శాంతిః శాంతిః శాంతిః