Ghantasala's Bhagawad Gita Part 3 Telugu
Ghantasala's Bhagawad Gita - ఘంటశాల భగవద్గీతా Telugu Part 3
051 ॥ సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికామ్ ।
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్ ॥ (09:07)
పార్థా! ప్రళయకాలమున సకల ప్రాణులును నా యందు లీనమగుచున్నవి. మరల కల్పాది యందు సకల ప్రాణులనూ నేనే సృష్టించు చున్నాను.
052 ॥ అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే ।
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ॥ (09:22)
ఏ మానవుడు సర్వకాల సర్వావస్థలయందు నన్నే ధ్యానించు చుండునో అట్టివాని యోగక్షేమములు నేనే వహించు చున్నాను.
053 ॥ పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి ।
తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః ॥ (09:26)
ఎవడు భక్తితో నాకు పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదక మైనను ఫలాపేక్ష రహితముగా సమర్పించుచున్నాడో, అట్టివానిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను.
054 ॥ మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు ।
మామేవైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణః ॥ (09:34)
పార్థా! నా యందు మనస్సు లగ్నము చేసి యెల్ల కాలములయందు భక్తి శ్రద్ధలతో స్థిరచిత్తుడవై పూజించితివేని నన్నే పొందగలవు.
ఇది ఉపనిషత్తుల సారాంశమైన యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునకుప దేశించిన కర్మసన్యాస, ఆత్మసంయమ, విజ్ఞాన, అక్షర పరబ్రహ్మ, రాజ విద్యా రాజగుహ్య యోగములు సమాప్తము.
-----------
055 ॥ మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా ।
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః ॥ (10:06)
కశ్యపాది మహర్షి సప్తకము, సనక సనందనాదులు, స్వయంభూవాది మనువులు నా వలననే జన్మించిరి. పిమ్మట వారి వలన ఎల్ల లోకములందలి సమస్త భూతములును జన్మించెను.
056 ॥ మచ్చిత్తా మద్గతప్రాణా బోధయంతః పరస్పరమ్ ।
కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ ॥ (10:09)
పండితులు నాయందు చిత్తముగలవారై నా యందే తమ ప్రాణములుంచి నా మహిమానుభావ మెరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించుకొంచు బ్రహ్మా నందమును అనుభవించుచున్నారు.
057 ॥ అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః ।
అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ ॥ (10:20)
సమస్త భూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడను నేనే. వాని ఉత్పత్తి, పెంపు, నాశములకు నేనే కారకుడను.
058 ॥ వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ।
ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా ॥ (10:22)
వేదములలో సామవేదము, దేవతలలో దేవేంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందరి బుద్ధి నేనే.
059 ॥ ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్ ।
మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణామ్ ॥ (10:30)
రాక్షసులలో ప్రహ్లాదుడు, గణికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడు నేనే.
060 ॥ యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా ।
తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోంశసంభవమ్ ॥ (10:41)
లోకమునందు ఐశ్వర్య యుక్తమై, పరాక్రమ యుక్తమై, కాంతి యుక్తమైన సమస్త వస్తువులు నా తేజో భాగము వలననే సంప్రాప్తమగును.
061 ॥ పశ్య మే పార్థ రూపాణి శతశోథ సహస్రశః ।
నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ ॥ (11:05)
పార్థా! దివ్యములై, నానా విధములై, అనేక వర్ణములై అనేక విశేషములగు నా సస్వరూపమును కన్నులారా దర్శింపుము.
062 ॥ పశ్యామి దేవాంస్తవ దేవ దేహే
సర్వాంస్తథా భూతవిశేషసంఘాన్ ।
బ్రహ్మాణమీశం కమలాసనస్థం
ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ ॥ (11:15)
అనేకబాహూదరవక్త్రనేత్రం
పశ్యామి త్వాం సర్వతోనంతరూపమ్ ।
నాంతం న మధ్యం న పునస్తవాదిం
పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప ॥ (11:16)
దంష్ట్రాకరాలాని చ తే ముఖాని
దృష్ట్వైవ కాలానలసన్నిభాని ।
దిశో న జానే న లభే చ శర్మ
ప్రసీద దేవేశ జగన్నివాస ॥ (11:25)
దేవా! ఎల్ల దేవతలూ, ఎల్ల ప్రాణులూ, బ్రహ్మాదులూ, ఋషీశ్వరులూ, వాసుకీ మొదలగుగా గల సర్పములూ నీయందు నాకు గోచరమగుచున్నవి.
ఈశ్వరా! నీ విశ్వరూపము అనేక బాహువులతో, ఉదరములతో, ముఖములతో ఒప్పియున్నది. అట్లైయూ నీ ఆకారమున ఆద్యంత మధ్యములను గుర్తింప జాల కున్నాను. కోరలచే భయంకరమై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుటవలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో! నాయందు దయ యుంచి నాకు ప్రసన్నుడవు గమ్ము. కృష్ణా! ప్రసన్నుడవు గమ్ము.
అర్జునా!
063 ॥ కాలోస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో
లోకాంసమాహర్తుమిహ ప్రవృత్తః ।
ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే
యేవస్థితాః ప్రత్యనీకేషు యోధాః ॥ (11:32)
అర్జునా! ఈ ప్రపంచమునెల్ల నశింపజేయు బలిష్ఠమైన కాల స్వరూపుడను నేనే. ఈ యుద్ధమునకు సిద్ధపడిన వారిని నీవు చంపకున్ననూ - బ్రతుక గలవారిందెవ్వరునూ లేరు.
064 ॥ ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ
కర్ణం తథాన్యానపి యోధవీరాన్ ।
మయా హతాంస్త్వం జహి మావ్యథిష్ఠా
యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్ ॥ (11:34)
ఇప్పటికే ద్రోణ, భీష్మ, జయద్రధ కర్ణాధి యోధ వీరులు నాచే సంహరింపబడిరి. ఇక మిగిలిన శతృ వీరులను నీవు సంహరింపుము.
065 ॥ కిరీటినం గదినం చక్రహస్తమ్ ।
ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ ।
తేనైవ రూపేణ చతుర్భుజేన ।
సహస్రబాహో భవ విశ్వమూర్తే ॥ (11:46)
అనేక భుజములుగల నీ విశ్వరూపమును ఉపసంహరించి కిరీటము, గద, చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింపగోరు చున్నాను కృష్ణా!
066 ॥ సుదుర్దర్శమిదం రూపం దృష్ట్వానసి యన్మమ ।
దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః ॥ (11:52)
అర్జునా! నీవు దర్శించిన ఈ నా స్వరూపమును ఎవ్వరునూ చూడజాలరు. ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరునూ సదా కోరుచుందురు.
067 ॥ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే ।
శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః (12:02)
ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి, శ్ర్ద్ధాభక్తులతో నన్ను ధ్యానించు చున్నారో, అట్టివారు అత్యంతమూ నాకు ప్రీతిపాత్రులు. వారే ఉత్తమ పురుషులు.
068 ॥ శ్రేయో హి జ్ఞానమభ్యాసాజ్జ్ఞానాద్-ధ్యానం విశిష్యతే ।
ధ్యానాత్కర్మఫలత్యాగస్త్యాగాచ్ఛాంతిరనంతరమ్ ॥ (12:12)
అభ్యాసయోగముకన్న జ్ఞానము, జ్ఞానము కన్న ధ్యానము, దానికన్న కర్మ ఫలత్యాగమూ శ్రేష్ఠము. అట్టి త్యాగమువల్ల సంసార బంధనము తొలగి మోక్షప్రాప్తి సన్భవించుచున్నది.
069 ॥ అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః ।
సర్వారంభపరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః ॥ (12:16)
ఎవడు కోరికలు లేనివాడై, పవిత్రుడై, పక్షపాత రహితుడై భయమును వీడి కర్మఫ్ల త్యాగియై నాకు భక్తుడగునో అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు.
070 ॥ సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః ।
శీతోష్ణసుఖదుఃఖేషు సమః సంగవివర్జితః ॥ (12:18)
తుల్యనిందాస్తుతిర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్ ।
అనికేతః స్థిరమతిర్భక్తిమాన్మే ప్రియో నరః ॥ (12:19)
శత్రుమిత్రులయందును, మానావ మానములయందును, శీతోష్ణ సుఖ దుఃఖాదులయందును సమబుద్ధి కలిగి, సంగరహితుడై, నిత్య సంతుష్టుడై, చలించని మనస్సు కలవాడై, నాయందు భక్తి ప్రపత్తులు చూపు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు.
071 ॥ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ।
ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః ॥ (13:02)
అర్జునా! దేహము క్షేత్రమనియూ, దేహమునెరిగినవాడు క్షేత్రజ్ఞుడనియూ పెద్దలు చెప్పుదురు.
072 ॥ అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనమ్ ।
ఏతజ్జ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యదతోన్యథా ॥ (13:12)
ఆత్మ జ్ఞానమునందు మనస్సు లగ్నము చేయుట, మౌక్షప్రాప్తి యందు దృష్టి కలిగియుండుట జ్ఞాన మార్గములనైయూ, వానికి ఇతరములైనవి అజ్ఞానములనియూ చెప్పబడును.
073 ॥ కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే ।
పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే ॥ (13:21)
ప్రకృతిని "మాయ" యని యందురు. అది శరీర సుఖదుఃఖాదులను తెలియజేయును. క్షేత్రజ్ఞుడు ఆ సుఖ దుఃఖములను అనుభవించుచుండును.
074 ॥ సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరమ్ ।
వినశ్యత్స్వవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి ॥ (13:28)
శరీరము నశించిననూ తాను సశింపక యెవడు సమస్త భూతములందున్న పరమేశ్వరుని చూచునో వాడే యెరిగినవాడు.
075 ॥ అనాదిత్వాన్నిర్గుణత్వాత్పరమాత్మాయమవ్యయః ।
శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే ॥ (13:32)
అర్జునా! గుణ నాశన రహితుడైనవాడు పరమాత్మ. అట్టి పరమాత్మ దేహాంత ర్గతుడయ్యునూ కర్మల నాచరించువాడు కాడు.