aMgana ninnaDigi rammane - అంగన నిన్నడిగి రమ్మనె

ప|| అంగన నిన్నడిగి రమ్మనె నీమాట | సంగతిగ మరుమాట సరి నాన తీవయ్యా ||

చ|| చెలులచే నింతి నీకు చెప్పిపంపిన మాటలు | తలచుకొన్నాడవా దయతో నీవు |

తొలుత గాను కంపిన దొడ్డ పూవుల బంతి | లలిమించిన పరిమళము గొంటివా ||

చ|| చాయల నాసతో నాపె సారె జూచిన చూపులు | ఆయములు గరచేనా అంటుకొనెనా |

చేయెత్తి సిగ్గుతోడ చేరి మొక్కిన మొక్కులు | ఆయనా నీకు శలవు అందరిలోనా ||

చ|| బెరసి తెరమాటున బెట్టిన నీపై సేసలు | శిరసుపై నిండెనా చిందెనా నీపై |

అరుదై శ్రీ వేంకటేశ అలమేలుమంగ యీకె | గరిమ నిన్ను గూడి గద్దెపై గూచున్నది ||


pa|| aMgana ninnaDigi rammane nImATa | saMgatiga marumATa sari nAna tIvayyA ||

ca|| celulacE niMti nIku ceppipaMpina mATalu | talacukonnADavA dayatO nIvu |

toluta gAnu kaMpina doDDa pUvula baMti | lalimiMcina parimaLamu goMTivA ||

ca|| cAyala nAsatO nApe sAre jUcina cUpulu | Ayamulu garacEnA aMTukonenA |

cEyetti siggutODa cEri mokkina mokkulu | AyanA nIku Salavu aMdarilOnA ||

ca|| berasi teramATuna beTTina nIpai sEsalu | Sirasupai niMDenA ciMdenA nIpai |

arudai SrI vEMkaTESa alamElumaMga yIke | garima ninnu gUDi gaddepai gUcunnadi ||

aMgaDi nevvaru naMTakurO yI - అంగడి నెవ్వరు నంటకురో యీ

ప|| అంగడి నెవ్వరు నంటకురో యీ- | దొంగలగూడిన ద్రోహులను ||

చ|| దోసము దోసము తొలరో శ్రీహరి- | దాసానదాసుల దగ్గరక ఆసలనాసల హరినెరుగక చెడి | వీసరపోయిన వెర్రులము ||

చ|| పాపము పాపము పాయరో కర్మపు- | దాపవువారము దగ్గరక | చేపట్టి వేదపు శ్రీహరి కథలు | యేపొద్దు విననిహీనులము ||

చ|| పంకము పంకము పైకొనిరాకురో | కొంకుగొసరులకూళలము | వేంకటగిరిపై విభునిపుణ్యకథ | లంకెల విననియన్యులము ||

pa|| aMgaDi nevvaru naMTakurO yI- | doMgalagUDina drOhulanu ||

ca|| dOsamu dOsamu tolarO SrIhari- | dAsAnadAsula daggaraka AsalanAsala harinerugaka ceDi | vIsarapOyina verrulamu ||

ca|| pApamu pApamu pAyarO karmapu- | dApavuvAramu daggaraka | cEpaTTi vEdapu SrIhari kathalu | yEpoddu vinanihInulamu ||

ca|| paMkamu paMkamu paikonirAkurO | koMkugosarulakULalamu | vEMkaTagiripai viBunipuNyakatha | laMkela vinaniyanyulamu ||

nityAtmuDai yumDi - నిత్యాత్ముఁడై యుండి


ప : నిత్యాత్ముఁడై యుండి నిత్యుఁడై వెలుఁగొందు - సత్యాత్ముఁడై యుండి సత్యమై తానుండు
ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సం- స్తుత్యుఁ డీతిరువేంకటాద్రివిభుఁడు

చ : ఏమూర్తి లోకంబులెల్ల నేలెడునాతఁ- డేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాతఁ-
డేమూర్తి నిజమోక్షమియ్యఁ జాలెడునాతఁ- డేమూర్తి లోకైకహితుఁడు
యేమూర్తి నిజమూర్తి యేమూర్తియునుఁ గాఁడు - యేమూర్తి త్రైమూర్తు లేకమైనయాతఁ-
డేమూర్తి సర్వాతుఁ డేమూర్తి పరమాత్ముఁ- డామూర్తి తిరువేంకటాద్రివిభుఁడు

చ : యేదేవుదేహమున నిన్ని యును జన్మించె - నేదేవుదేహమున నిన్నియును నణఁగె మరి
యేదేవువిగ్రహం బీసకల మింతయును - యేదేవునేత్రంబు లినచంద్రులు
యేదేవుఁ డీజీవులిన్నింటిలో నుండు - నేదేవుచైతన్య మిన్నిటికి నాధార-
మేదేవుఁ డవ్యక్తుఁ డేదేవుఁ డద్వంద్వుంఁ- డాదేవుఁ డీవేంకటాద్రివిభుఁడు

చ : యేవేల్పుపాదయుగ మిలయునాకాశంబు - యేవేల్పుపాదకేశాంతం బనంతంబు
యేవేల్పునిశ్వాస మీమహామారుతము - యేవేల్పునిజదాసు లీపుణ్యులు
యేవేల్పు సర్వేశుఁ డేవేల్పు పరమేశుఁ- డేవేల్పు భువనైకహితమనోభావకుఁడు
యేవేల్పు కడుసూక్ష్మ మేవేల్పు కడుఘనము - ఆవేల్పు తిరువేంకటాద్రివిభుఁడు


pa : nityAtmu@mDai yumDi nityu@mDai velu@Mgomdu - satyAtmu@mDai yumDi satyamai tAnumDu
pratyakShamai yumDi brahmamai yumDu sam- stutyu@M DItiruvEmkaTAdrivibhu@MDu

cha : EmUrti lOkambulella nEleDunAta@M- DEmUrti brahmAdulella vedakeDunAta@M-
DEmUrti nijamOkShamiyya@M jAleDunAta@M- DEmUrti lOkaikahitu@MDu
yEmUrti nijamUrti yEmUrtiyunu@M gA@mDu - yEmUrti traimUrtu lEkamainayAta@M-
DEmUrti sarwAtu@M DEmUrti paramAtmu@M- DAmUrti tiruvEmkaTAdrivibhu@MDu

cha : yEdEvudEhamuna ninni yunu janminche - nEdEvudEhamuna ninniyunu naNa@Mge mari
yEdEvuvigraham bIsakala mimtayunu - yEdEvunEtrambu linachamdrulu
yEdEvu@M DIjIvulinnimTilO numDu - nEdEvuchaitanya minniTiki nAdhAra-
mEdEvu@M Davyaktu@M DEdEvu@M Dadwamdwum@M- DAdEvu@M DIvEmkaTAdrivibhu@MDu

cha : yEvElpupAdayuga milayunAkASambu - yEvElpupAdakESAmtam banamtambu
yEvElpuniSwAsa mImahAmArutamu - yEvElpunijadAsu lIpuNyulu
yEvElpu sarwESu@M DEvElpu paramESu@M- DEvElpu bhuvanaikahitamanObhAvaku@MDu
yEvElpu kaDusUkShma mEvElpu kaDughanamu - AvElpu tiruvEmkaTAdrivibhu@MDu

nE nokkaDa lEkuMDitE - నే నొక్కడ లేకుండితే

నే నొక్కడ లేకుండితే నీకృపకు పాత్ర మేది
పూని నావల్లనే కీర్తి బొందేవు నీవు

అతి మూఢులలోన నగ్రేసరుడ నేను
ప్రతిలేనిఘనగర్వపర్వతమను
తతి బంచేంద్రియములధనవంతుడను నేను
వెతకి నావంటివాని విడువగ జెల్లునా

మహిలో సంసారపుసామ్రాజ్యమేలేవాడ నేను
యిహమున గర్మవహికెక్కితి నేను
బహుయోనికూపసంపద దేలేవాడ నేను
వహించుక నావంటివాని దేనోపేవా

భావించి నావంటినీచు బట్టి కాచినప్పుడుగా
యేవంక నీకీర్తి గడువెంతురు భువి
నావల్ల నీకు బుణ్యము నీవల్లనే బ్రదుకుదు
శ్రీవేంకటేశుడ యింత చేరె జుమ్మీ మేలు


nE nokkaDa lEkuMDitE nIkRpaku pAtra mEdi
pUni nAvallanE kIrti boMdEvu nIvu

ati mUDhulalOna nagrEsaruDa nEnu
pratilEnighanagarvaparvatamanu
tati baMchEMdriyamuladhanavaMtuDanu nEnu
vetaki nAvaMTivAni viDuvaga jellunA

mahilO saMsaarapusAmrAjyamElEvADa nEnu
yihamuna garmavahikekkiti nEnu
bahuyOnikUpasaMpada dElEvADa nEnu
vahiMchuka nAvaMTivAni dEnOpEvA

bhAviMchi nAvaMTinIchu baTTi kAchinappuDugA
yEvaMka nIkIrti gaDuveMturu bhuvi
nAvalla nIku buNyamu nIvallanE bradukudu
SrIvEMkaTESuDa yiMta chEre jummI mElu

talachichUDa paratatwaMbitaDu - తలచిచూడ పరతత్వంబితడు



తలచిచూడ పరతత్వంబితడు
వలసినవారికి వరదుడితడు

సిరికి మగడమృతసింధువునకు నల్లుడు
సరుస పార్వతికి సయిదోడు
గరిమెల బ్రహ్మకుఁ గన్న తండ్రి యితడు
పరగి శివునకు బావ యితడు

అల దేవేంద్రుని యనుజుడితడు
మలసి చంద్రుని మఱదితడు
కులమున నదితికి కొడుకూ నితడు
తలపు సురాసురలతాతయు నితడు

ప్రాణుల కెల్లా బంధుడితడు
వాణికి మామగు వావి యితడు
జాణ శ్రీవేంకటాచల రమణుడితడు
మాణికపు మన్మథుడితడు


talachichUDa paratatwaMbitaDu
valasinavAriki varaduDitaDu

siriki magaDamRtasiMdhuvunaku nalluDu
sarusa pArwatiki sayidODu
garimela brahmaku@M ganna taMDri yitaDu
paragi Sivunaku bAva yitaDu

ala dEvEMdruni yanujuDitaDu
malasi chaMdruni ma~raditaDu
kulamuna naditiki koDukU nitaDu
talapu surAsuralatAtayu nitaDu

prANula kellA baMdhuDitaDu
vANiki mAmagu vAvi yitaDu
jANa SrIvEMkaTAchala ramaNuDitaDu
mANikapu manmathuDitaDu


jnAnayajnamIgati mOkshasAdhanamu - జ్ఞానయజ్ఞమీగతి




ప|| జ్ఞానయజ్ఞమీగతి మోక్షసాధనము | నానార్థములు నిన్నే నడపె మాగురుడు ||

చ|| అలరి దేహమనేటి యాగశాలలోన | బలువై యజ్ఞానపుపశువు బంధించి |
కలసి వైరాగ్యపుకత్తుల గోసికోసి | వెలయు జ్ఞానాగ్నిలో వేలిచె మాగురుడు ||

చ|| మొక్కుచు వైష్ణవులనేమునిసభ గూడపెట్టి | చొక్కుచు శ్రీపాదతీర్థ సోమపానము నించి |
చక్కగా సంకీర్తనసామగానము చేసి | యిక్కువతో యజ్ఞము సేయించెబో మాగురుడు ||

చ|| తదియ్యగురు ప్రసాదపు పురోడాశమిచ్చి | కొదదీర ద్వయమనుకుండలంబులు వెట్టి |
యెదలో శ్రీవేంకటేశు నిటు ప్రత్యక్షముచేసె | యిదివో స్వరూపదీక్ష యిచ్చెను మా గురుడు |
|

pa|| j~nAnayaj~namIgati mOkshasAdhanamu | nAnaarthamulu ninnE naDape mAguruDu ||

cha|| alari dEhamanETi yAgaSAlalOna | baluvai yaj~nAnapupaSuvu baMdhiMchi |
kalasi vairAgyapukattula gOsikOsi | velayu j~nAnAgnilO vEliche mAguruDu ||

cha|| mokkuchu vaishNavulanEmunisabha gUDapeTTi | chokkuchu SrIpAdatIrtha sOmapAnamu niMchi |
chakkagaa saMkIrtanasAmagAnamu chEsi | yikkuvatO yaj~namu sEyiMchebO mAguruDu ||

cha|| tadiyyaguru prasaadapu purODaaSamichchi | kodadIra dvayamanukuMDalaMbulu veTTi |
yedalO SrIvEMkaTaeSu niTu pratyakshamuchEse | yidivO svarUpadIksha yichchenu maa guruDu ||


Sung by:Balakrishna Prasad

rAnu mIkaDaku O ramaNulAra - రాను మీకడకు


రాను మీకడకు ఓ రమణులార, పూవుఁ
బానుపు హరికినేఁ బఱవవలయును నేడు

చెలగి దేవుడు నేడు సిరితో నేటికి నో
పొలయలుకలవలపులు నటియించి
తలపోత విరహవేదనలనున్నాడు ఈ
చలిమందు లతనికి చాతవలయు నేడు

రమణుడిప్పుడు యిందిరాదేవియెదుటను
తమకించి యెవ్వతెనో తలంచెనట
కమల కోపింప గాకల నారగింపడు ఈ
హిమజల అతనికి యీయవలయును నేడు

వెలదిబాసి తిరువేంకటేశ్వరుడు
కలికియై కౌగిటఁ గలసెనట
తిలకము గరగేటి తిరుమేనిచెమట యీ
వెలినుండి పలుమారు విసరవలయు నేడు


rAnu mIkaDaku O ramaNulAra, pUvu@M
bAnupu harikinE@M ba~ravavalayunu nEDu

chelagi dEvuDu nEDu siritO nETiki nO
polayalukalavalapulu naTiyiMchi
talapOta virahavEdanalanunnADu I
chalimaMdu lataniki chAtavalayu nEDu

ramaNuDippuDu yiMdirAdEviyeduTanu
tamakiMchi yevvatenO talamchenaTa
kamala kOpiMpa gAkala nAragiMpaDu I
himajala ataniki yIyavalayunu nEDu

veladibAsi tiruvEMkaTESwaruDu
kalikiyai kaugiTa@M galasenaTa
tilakamu garagETi tirumEnichemaTa yI
velinuMDi palumAru visaravalayu nEDu