Intulala navanka - ఇంతులాల నావంక

ఇంతులాల నావంక నిదే తప్పు
కొంతైనాఁ బిలువనంటాఁ గొసరీ మనసు
॥పల్లవి॥
మాటకు మాటాడను మరి కల్లలెంచెను
నాఁటుకొన్న చూపులతో నవ్వితి నేను
గీఁటెఁ గొనగొరఁ దానే కిందుపడ నొక్కెఁ దానే
కూటమికి రానంటాఁ గోపగించీఁ దాను
॥॥
పతికిఁ బతి సేయను పను లేమి నడుగను
అతికాఁకఁ దనమేనే అంటితి నేను
కతలు చెప్పీఁ దానే ఘాతలుసేసీఁ దానే
తతితో దగ్గరనంటా దమకించీఁ దాను
॥॥
కాదుగూడ దనను కఱకరి సేయను
యీదెసఁ దనకుఁ బంతమిచ్చితి నేను
సేదదేర నన్నుఁ గూడె శ్రీ వేంకటేశుఁడు దానె
పోదితో మెచ్చితినంటాఁ బొదిగీఁ దాను
॥॥