Vinayaka Vratha Katha - వినాయక వ్రత కథ
Sri Siddhi Vinayaka Vratha Katha – శ్రీ సిద్ధివినాయక వ్రత కథ విఘ్నేశ్వరుని కథా ప్రారంభమ మున్ను నైమిశారణ్యంబున సత్రయాగంబుచేయు శౌనకాదిమహర్షులకు సకలకథావిశారదుడగు సూతమహాముని యొకనాడు విఘ్నేశ్వరోత్పత్తియు, చంద్రదర్శన దోషకారణంబును, శాపమోక్షప్రకారంబును చెప్పదొడంగెను. గజాసుర వృత్తాంతం : పూర్వము గజరూపముతో నున్న రాక్షసేశ్వరుండు శివుని గూర్చి ఘోర తపంబొనర్ప, అతని తపమునకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్ష్యమై వరంబు కోరుమన, గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి “స్వామీ! మీరు ఎల్లప్పుడూ నా యుదరమందే వసించి కాపాడుచుండు”డని కోరగా భక్తసులభుండగు నా మహేశ్వరుండాతని కోర్కెదీర్ప గజాసురుని యుదరమందు ప్రవేశించి సుఖంబుగ నుండె. కైలాసమున పార్వతీదేవి భర్తజాడ దెలియక పలుతెరంగుల నన్వేషించుచు కొంతకాలంబునకు గజాసురగర్భస్థుడగుట తెలిసి రప్పించుకొనుమార్గంబు గానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతివృత్తాంతమును దెలిపి, “యో మహానుభావ! పూర్వము భస్మాసురుని బారినుండి నా పతిని రక్షించి నాకొసంగితివి. ఇప్పుడుగూడ నుపాయాంతరముచే రక్షింపు” మని విలపింప హరి యాపార్వతీదేవి నూరడించి కైలాసంబున నుండుమని దెల్పి యంత నా హరియు బ్రహ్మాదిదేవతలను పిల...